అత్యాచారం-హత్య కేసులో నిందితులుగా వున్న ఇద్దరు వ్యక్తులని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ... ఆ నిందితులపై జనానికి వున్న ఆగ్రహం మాత్రం చల్లారలేదు. అందుకే ఆ నిందితులని స్టేషన్‌లోంచి బయటికి లాగి మరీ పోలీసులు చూస్తుండగానే కొట్టి చంపారు. జనమే శాంతి భద్రతలని తమ చేతుల్లోకి తీసుకున్న ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జనాగ్రహానికి గురై ప్రాణాలు విడిచిన ఇద్దరూ ఐదున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, ఆమె తల నరికి చంపిన కేసులో నిందితులుగా వున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరి 12న వాక్రో పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ఐదున్నరేళ్ల చిన్నారి అదృశ్యమైంది. ఆ తర్వాత నాంగో గ్రామానికి సమీపంలో వున్న ఓ అటవీ ప్రాంతంలో రక్తపు మడుగులో ఆ చిన్నారి శవం లభ్యమైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు 30 ఏళ్ల సంజయ్ సోబొర్, 25 ఏళ్ల జగదీష్ లోహర్‌లకు ఈ ఘటనతో సంబంధం వున్నట్టు అనుమానం కలిగింది. వెంటనే ఇ ద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చేసిన తప్పిదాన్ని ఒప్పుకున్నారు. నిందితులని ఆదివారం కోర్టులో హాజరుపర్చగా.. మరింత విచారణ నిమిత్తం కోర్టు వారిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 


ఇదే క్రమంలో తమ చిన్నారిని పొట్టన పెట్టుకున్న నిందితులు పోలీసుల అదుపులో వున్నారనే సమాచారం అందుకున్న జనం.. ఒక్కసారిగా పోలీసు స్టేషన్‌లోకి చొరబడి నిందితులని బయటికి లాక్కొచ్చి మరీ కొట్టి చంపి అందరూ చూస్తుండగానే బొందపెట్టారు. జనాగ్రహాన్ని చూసి ప్రేక్షక పాత్ర వహించడం తప్ప అక్కడ బందోబస్తులో వున్న పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటనని తీవ్రంగా పరిగణించిన అరుణాచల్ ప్రదేశ్ సర్కార్.. పోలీస్ స్టేషన్‌లో అప్పుడు డ్యూటీలో వున్న ముగ్గురు పోలీసులని సస్పండ్ చేయడంతోపాటు జిల్లా ఎస్పీని అక్కడి నుంచి బదిలీ చేస్తున్నట్టు ఆదేశాలు జారీచేసింది.