ఏ ప్రభుత్వ సంస్థలోనైనా ఉద్యోగం సంపాదించాలంటే రాతపరీక్ష, ముఖాముఖి పరీక్షల్లో నెగ్గడం తప్పనిసరి. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని విచిత్ర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఒక్క క్షణం ప్రతిభా పాటవాలను పక్కన పెట్టి.. కేవలం బొమ్మా బొరుసుతో ఓ ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించారు. ఆ పని చేసింది కూడా ఓ రాష్ట్రమంత్రి కావడం గమనార్హం. 


వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లో ఓ లెక్చరర్ పోస్టు భర్తీకి మంత్రి చరణ్ జిత్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ చివరి రౌండ్‌లో ఇద్దరిని ఎంపిక చేసింది. వారిద్దరికి వేర్వేరు ప్రత్యేకతలు ఉండటంతో ఉద్యోగం ఎవరికి ఇవ్వాలో తేల్చాలని మంత్రి టాస్ వేశారు. ఇలా కూడా ఎంపిక జరుగుతుందా? అని ఒకవైపు విమర్శలు వస్తుంటే.. ఇలా కాకుండా ఎవరిని ఎంపిక చేసినా ఏదో ఒక వివాదం వచ్చేదని మరికొందరు అంటున్నారు. ఈ విషయంపై మంత్రిగారిని అడిగితే - ఆ ఇద్దరి అనుమతితోనే టాస్ వేశానని సెలవిచ్చారు.