ఈ సంవత్సరం ప్రకటించబోయే ఆర్థి్క శాస్త్రానికి సంబంధించి నోబెల్‌ ప్రైజు అవార్డు గ్రహీతల రేసులో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌  కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నోబెల్ ప్రైజులు ఏ ప్రాతిపదికిన అందజేస్తారు..ఎవరెవరికి వచ్చే అవకాశం ఉందనే విషయాల్లో నిరంతర అధ్యయనం చేసే క్లారివేట్‌ అనలిటిక్స్‌  అనే సంస్థ విడుదల చేసిన జాబితాలో రాజన్‌ పేరు సైతం ఉండడంతో ఆయన కూడా రేసులో ఉన్నారా? అన్న సందేహాన్ని పలువురు వ్యక్తపరుస్తున్నారు. . భౌతిక, రసాయన, వైద్యం, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో అత్యుత్తమ కృషి చేసిన వారికి ప్రతి సంవత్సరం నోబెల్‌ అవార్డులు అందిస్తారు. 2017 గాను ఇప్పటికే ఐదు రంగాల్లో పురస్కారాలను ప్రకటించగా.. అక్టోబర్‌ 9  ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌  ప్రకటించనున్నారు.


క్లారివేట్‌ అనలిటిక్స్‌ అనే సంస్థ ప్రతీ సంవత్సరం నోబెల్‌ పురస్కార గ్రహీతలపై అధ్యయనం చేస్తుంది. ఆ అధ్యయనం ప్రకారం పురస్కార కమిటీ ప్రైజులను అధికారికంగా ప్రకటించడానికి ముందే  రేసులో ఉన్న వ్యక్తుల జాబితాను తయారుచేస్తుంది ఈ సంస్థ. ఇటీవలే వెలువడిన ఈ జాబితా ప్రకారం..  ఈ సంవత్సరం ఆర్థికశాస్త్రంలో  నోబెల్‌కు నామినేట్ అయిన వారి జాబితాలో..ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రాజన్‌ కూడా ఉండడం గమనార్హం. క్లారివేట్‌ తమ వెబ్‌సైట్ ద్వారా ఈ విషయాన్ని బహిర్గతం చేసింది‌.