కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్.. సీడబ్ల్యూసీ రద్దు
తల్లి సోనియా గాంధీ వద్ద నుండి కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల తరువాత, రాహుల్ గాంధీ తన `టీం`కు తుది రూపం ఇవ్వనున్నారు.
తల్లి సోనియా గాంధీ వద్ద నుండి కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల తరువాత, రాహుల్ గాంధీ తన 'టీం'కు తుది రూపం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో సోనియా గాంధీ నియమించిన అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని రాహుల్ గాంధీ రద్దు చేశారు. దాని స్థానంలో 34 మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీని నియమించారు.
ఢిల్లీలో మార్చి రెండోవారంలో నిర్వహించనున్న పార్టీ ప్లీనరీ సమావేశాలను ఈ స్టీరింగ్ కమిటీ సారథ్యంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ ఎన్నికతో సహా పార్టీ సంస్థాగత ఎన్నికల ముగింపుపై స్టీరింగ్ కమిటీ ఆమోదముద్ర వేయనుంది. కొత్తగా ఏర్పాటు చేసే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యులను ప్లీనరీ సమావేశాల్లోగానీ, ఆ తరువాతగానీ ఎన్నుకుంటామని, అంతవరకు స్టీరింగ్ కమిటీ ప్లీనరీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జనార్దన్ ద్వివేది ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ స్టీరింగ్ కమిటీ..
కొత్తగా ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సహా ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, గులాంనబీ అజాద్, అంబికాసోని, జనార్దన్ ద్వివేది, అశోక్‌గెహ్లాట్, సుశీల్‌కుమార్‌షిండే, పి.చిదంబరం, ఆస్కార్ ఫెర్నాండెజ్, ఆనంద్‌శర్మ, సీపీ జోషి, దిగ్విజయ్‌సింగ్, బీకే హరిప్రసాద్, కమల్‌నాథ్, మల్లికార్జున్ ఖర్గే, మోతీలాల్ ఓరా, హెమోప్రోవ సైకియా, రణదీప్ సుర్జీవాలా సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్న పీఎల్ పునియా, ఆర్‌పీఎన్ సింగ్, దీపక్ బబారియా, ఆర్‌సీ కుంతియా, కేసీ వేణుగోపాల్, అవినాష్ పాండే కూడా సభ్యులుగా వ్యవహరిస్తారు.