కోల్‌కతా: పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా రాజుకున్న అగ్గి ఇంకా చల్లారడం లేదు. అసోంలో భగ్గుమన్న నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోనూ అదే పరిస్థితి ఏర్పడింది. పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేస్తున్న నిరసన హింసాత్మకంగా మారింది. హౌరా, ముర్షీదాబాద్ జిల్లాల్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. రైల్వే స్టేషన్లలో హంగామా సృష్టించారు. రైల్వే స్టేషన్‌లోని ఆస్తులను ధ్వంసం చేశారు. సక్రెయిల్ రైల్వే స్టేషన్‌లో టికెట్ కౌంటర్‌కు నిప్పుపెట్టారు. ఆందోళనలు ఉద్ధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయా మార్గాల గుండా వెళ్లాల్సిన రైళ్లను దారి మళ్లించారు. కొన్ని రైళ్లను రద్దు చేశారు. మరోవైపు ఆందోళనకారులు రోడ్లపైన కూడా హంగామా సృష్టించారు. 


పశ్చిమ బెంగాల్ ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. పలు బస్సుల అద్దాలు పగులగొట్టారు. కోనా ఎక్స్‌ప్రెస్ వేపై పెద్ద ఎత్తున గుమిగూడిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది.