రాజస్తాన్‌లో బీజేపికి ఎన్నికల ముందు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ నేత, లోక్ సభ సభ్యుడు హరీష్ మీనా, బీజేపీ ఎమ్మెల్యే హబిబుర్ రహమాన్ అశ్రషి లంబ బుధవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ సమక్షంలో ఢిల్లీలో వీళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే బీజేపీ నుంచి బయటికొచ్చిన హనుమాన్ బెనివాల్.. సొంతంగా రాష్ట్రీయ్ లోక్‌తంత్రిక్ పార్టీ(ఆర్ఎల్‌పీ)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తనలాంటి ఆలోచనా విధానం ఉన్న వాళ్లతో కలిసి పనిచేస్తూ భవిష్యత్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేదే తన వ్యూహం అని హనుమాన్ బెనివాల్ ప్రకటించారు. ఇటీవలే బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర గోయల్ బీజేపీ నుంచి బయటికొచ్చి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు.


వరుస రాజీనామాలతో రాజస్తాన్‌లో అధికార పార్టీ అయిన బీజేపీకి ఎదురు దెబ్బలు తప్పడం లేదు.