తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే మాట్లాడుతూ.. తాను కూడా రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పార్టీని ఎప్పుడు ప్రారంభిస్తున్నారో తెలపలేదు. అయితే ఆయన కొత్త పార్టీ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు అయ్యిందని..  రజనీ మక్కల్‌ మండ్రమ్‌ సభ్యులు ఈ సంవత్సరం డిసెంబరు 12 తేదిన (రజనీకాంత్ పుట్టినరోజు నాడు) పార్టీని అధికారికంగా ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి. మండ్రమ్‌ జిల్లా శాఖ సమావేశాలు ఈ నెల 5 నుండి 11 తేది వరకు జరిగిప్పుడు ఇదే విషయం చాలామంది మాట్లాడుకోవడం జరిగింది. అయితే అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి సమాచారమూ లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్‌గా నిర్వహించాల్సిన అవసరం ఉందని.. అందుకోసం ఫ్యాన్స్ జన సమీకరణ కోసం ఇప్పటి  నుండే పనిచేయాలని కూడా రజనీ కార్యాలయం నుండి ఆదేశాలు అందినట్లు కూడా పలువురు అంటున్నారు. అయితే రజనీకాంత్ నుండి ఈ విషయమై ఎలాంటి సమాచారం కూడా లేకపోవడం గమనార్హం. రజనీకాంత్ పార్టీ విధి విధానాలు ఏమిటో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. స్పిరిచ్యువల్ పాలిటిక్స్ అని మాత్రమే ఆయన గతంలో పేర్కొన్నారు.


కాగా.. గత రెండు సంవత్సరాలుగా ప్రాంతీయవాదం, దళితవాదాన్ని ప్రమోట్ చేసే సినిమాల్లోనే రజనీ నటిస్తున్నారు. ఈ చిత్రాలలో కూడా రాజకీయ రంగాన్ని ప్రశ్నించే సంభాషణలకు చోటివ్వడం జరుగుతోంది. కబాలి, కాలా లాంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. చిత్రమేమిటంటే.. ఆ రెండు చిత్రాలకూ పా రంజితే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం రజనీకాంత్, శంకర్ కాంబినేషనులో వస్తున్న 2.0 చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం తర్వాత కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పెట్టా" చిత్రంలో రజనీ  నటిస్తున్నారు.