కేంద్ర సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షంపై, యూపీఏ వైఖరిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రస్తావన తీసుకొచ్చిన మన మిత్రులైతేనేం లేదా రాజకీయ పార్టీలు అయితేనేం.. వారికి ప్రజాభిప్రాయం మీద విశ్వాసం లేదనే భావించాల్సి ఉంటుంది. అందుకే వాళ్లు అధికార పార్టీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారు అని రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. 15 ఏళ్ల తర్వాత ఓ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. 15 ఏళ్ల క్రితం అప్పటి వాజ్‌పేయి సర్కార్‌పై అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత మళ్లీ పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్‌పై ఏ రోజు కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని బీజేపీ భావించలేదు. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్‌కి ప్రజా మద్దతు ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజా మద్దతు ఉన్న పార్టీ పాలనను అడ్డుకోకూడదు అని బీజేపీ భావించింది కనుకే వారిపై ఆ పదేళ్ల కాలంలో ఏనాడూ అవిశ్వాస తీర్మానం ప్రస్తావన తీసుకురాలేదు అని రాజ్‌నాథ్ సింగ్ లోక్ సభలో స్పష్టంచేశారు.


ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గురించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల అభిప్రాయాలను గౌరవించాలనే సదుద్దేశంతోనే ఈ అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించడం జరుగుతోంది అని అభిప్రాయపడ్డారు.