Rajya Sabha ruckus on farm bills 8 MPs suspended: ఢిల్లీ‌: వ్య‌వ‌సాయ బిల్లుల‌ (Agriculture Bills) పై రాజ్య‌స‌భ‌లో ఆదివారం దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టగా.. వాటిని వ్యతిరికిస్తూ విపక్షపార్టీల సభ్యులు సభలో నినాదాలు చేస్తూ పోడియాన్ని చుట్టుముట్టారు. కొన్ని నిమిషాల వాయిదా అనంతరం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారయణ్ సింగ్ మూజువాణీ ఓటుతో బిల్లులకు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అనంతరం విపక్షపార్టీలు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి సోటీసు ఇచ్చాయి. దీంతో నిన్న అనుచితంగా ప్రవర్తించిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాజ్యసభ చైర్మన్‌కు కోరింది. అయితే ఈ ఘటనపై రాజ్యసభ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు (Venkaiah Naidu) సోమవారం మాట్లాడుతూ.. నిజంగా ఇది చీకటి దినం అంటూ.. ఆందోళన చేసిన ఎంపీలపై ఫైర్ అయ్యారు. విప‌క్ష ఎంపీలు సోష‌ల్ డిస్టెన్స్‌, కోవిడ్ (Coronavirus) నిబంధ‌న‌లు విస్మ‌రించారని.. దీంతోపాటు వెల్‌లోకి దూసుకువ‌చ్చి అమర్యాదగా వ్యవహరించార‌న్నారు. డిప్యూటీ చైర్మ‌న్‌పై పేప‌ర్లు, రూల్ బుక్‌ను విసిరేయడం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తూ అనుచితంగా ప్రవర్తించిన పలుపార్టీలకు చెందిన 8మంది రాజ్యసభ సభ్యులపై ఆయన స‌స్పెన్ష‌న్ విధించారు. Also read: Agriculture Bills: డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌పై అవిశ్వాసానికి నోటీసు


ఇదిలాఉంటే.. డిప్యూటీ చైర్మ‌న్‌ హరివంశ్‌పై విప‌క్ష స‌భ్యులు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం చెల్ల‌దని వెంక‌య్య నాయుడు స్పష్టంచేశారు. నోటీసు ఇవ్వ‌డానికి 14 రోజుల గ‌డువు ఇవ్వాల‌ని, రూల్స్ ప్రకారం ఈ నోటీసు చెల్ల‌దని అభిప్రాయపడుతూ.. దానిని తిర‌స్క‌రించారు. అనంతరం పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ముర‌ళీధ‌ర‌న్‌ మాట్లాడుతూ... 8 మంది స‌భ్యుల‌ను స‌భ నుంచి వారం పాటు స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  ఈ సెష‌న్ మొత్తం వారిపై వేటు వేస్తున్న‌ట్లు తెలిపారు. డెరిక్ ఓబ్రెయిన్‌తో పాటు సంజ‌య్ సింగ్‌, రాజీవ్ స‌తావ్‌, కేకే రాజేశ్‌, స‌య్యిద్ న‌జీర్ హుస్సేన్‌, రిపున్ బోరా, డోలా సేన్‌, ఇల‌మారం క‌రీమ్‌ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. అయితే వారిని సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించినప్పటికీ.. వారు వెళ్లకపోవడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.  Also read: Agriculture bills: వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో ఆమోదం