2019లో ప్రధాని పదవి ఖాళీగా లేదని.. వీలైతే 2024లో ఆ పదవిని పొందేందుకు కాంగ్రెస్ లేదా ఇతర పార్టీ అయినా ఇప్పటి నుండే కష్టపడి పనిచేయాలని లోక్ జన శక్తి పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ జోకులు వేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నికైన ప్రభుత్వాలతో పోల్చుకుంటే.. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పనిచేసిన ప్రభుత్వం ఎక్కువ విజయాలు సాధించిందని ఈ సందర్భంగా పాశ్వాన్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఒకవేళ ప్రధాని పదవికి పోటీ పడాలనుకుంటే.. 2024 సంవత్సరమే వారికి మంచి ఆప్షన్ అని.. అంతే కానీ.. 2019 సంవత్సరం వల్ల వారికి ఒరిగేదీ ఏమీ లేదని పాశ్వాన్ అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2024లో కూడా కష్టపడితేనే విజయం దక్కే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీని కూడా పాశ్వాన్ పొగడ్తలతో ముంచెత్తారు. మచ్చ లేని నాయకుడు, ఆరోపణలు లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. ఆయన నరేంద్ర మోదీ మాత్రమేనని పాశ్వాన్ తెలిపారు. నరేంద్ర మోదీ ప్రతీ రోజు కనీసం 20 గంటలు పనిచేస్తారని... అదే ఆయన గొప్పతనమని అన్నారు. 


తొలుత సంయుక్త సోషలిస్టు పార్టీ ద్వారా కెరీర్ ప్రారంభించిన రాం విలాస్ పాశ్వాన్ 1969లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1974లో లోక్ దల్‌‌లో చేరారు. 1977లో జనతాపార్టీ మెంబరుగా లోక్ సభకు ఎన్నికయ్యారు. 2000లో స్వయంగా లోక్ జనశక్తి పార్టీ స్థాపించారు. 2004లో యూపీఏ ప్రభుత్వానికి సపోర్టు చేస్తూ.. వారి హయాంలోనే కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రిగా, ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2010 నుండి 2014 వరకు రాజ్యసభ మెంబరుగా ఉన్నారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.