Ravan Effigy Collapsed in Yamunanagar: రావణ దహనం చేస్తుండగా రావణుడి బొమ్మ కూలిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యమునానగర్‌లో సాయంత్రం వేళ రావన దహనం నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు అందరూ రావణ దహనం కళ్లారా వీక్షించేందుకు మైదానంలోరవ చేరుకున్నారు. రావణ దహనం మొదలైంది. రావణుడి దిష్టి బొమ్మకు నిప్పు పెట్టారు. దాదాపుగా పైవరకు మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో గాలి వీయడంతో కుదుపునకు గురైన రావణుడి బొమ్మ తగలబడుతున్న మంటలతోనే ఒక పక్కకు ఒరిగి కూలిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పటి వరకు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ అతి సమీపంలో నిలబడి రావణ దహనం వీక్షిస్తున్న జనం అక్కడి నుంచి దూరంగా పరుగులు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ.. రావణుడి బొమ్మ కూడా అతి ఎత్తులో ఉండటంతో దాని పొడవును దాటుకుని తప్పించుకుని పోలేకపోయారు. దీంతో రావణుడి బొమ్మపై భాగం అక్కడి జనంపై పడిపోయింది. బొమ్మ కింద మంటల్లో చిక్కుకుపోయిన వారిని స్థానికులు ప్రాణాలకు తెగించి బయటికి లాక్కొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పి గాయాలతో బయటపడ్డారు. లేదంటే ఊహించని నష్టం జరిగిపోయి ఉండేది. రావణ దహనం సందర్భంగా రావణుడి బొమ్మ మీద పడి గాయపడిన వారిని యమునా నగర్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

దసరా వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల రావణ దహనం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అయితే, యమునా నగర్ ఘటన మాత్రం మరోసారి 2018 నాటి అమృత్‌సర్ దుర్ఘటనను గుర్తుచేసింది. నాలుగేళ్ల క్రితం అమృత్‌సర్‌లోని జోడా ఫాటక్ వద్ద రావణ దహనంలో పాల్గొన్న జనం రావణ దహనం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సమయంలోనే రైలు పట్టాలపై నిలబడిన జనంపైకి ఎక్స్‌ప్రెస్ రైలు అతి వేగంగా దూసుకొచ్చిన ఘటనలో 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొంత మంది గాయాలతో బయటపడి బతికున్న శవాలుగా మిగిలారు. సంచలనం సృష్టించిన అమృత్‌సర్ దుర్ఘటన అప్పట్లో దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అమృత్‌సర్ వాసుల్లో దసరా వేడుకలు ఇప్పటికీ ఓ పీడకలగానే మిగిలిపోయాయి.