దేశంలో నల్లదనాన్ని అరికట్టేందుకు ఆర్‌బీఐ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  నోట్ల రద్దు తరువాత చిల్లర సమస్యను అధిగమించేందుకు ఆర్‌బీఐ గతంలో పది రూపాయల నాణేలను, రూ.200 నోట్లను, రూ.50 రూపాయల నోట్లను తీసుకొచ్చింది. తాజాగా రూ.350 నాణేలను తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ కసరత్తు చేస్తోంది. శ్రీ గురు గోబింద్ సింగ్ జీ 350వ జయంతి సందర్భంగా ఈ నాణేలను మార్కెట్‌లో విడుదల చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నాణెం చుట్టుకొలత 40 మిల్లిమీటర్లు కాగా, వెండి (50 శాతం), కాపర్ (40 శాతం), నికెల్ (5 శాతం), జింక్ (5 శాతం)లను ఉపయోగించి నాణేన్ని తయారు చేశారు.  నాణేనికి ముందు వైపు (బొమ్మ) 'అశోక పిల్లర్' ఉంటుంది. అశోక పిల్లర్ కింద 'సత్యమేవ జయతే' అనే అక్షరాలు, దేవనాగరి లిపిలో 'భారత్', కుడివైపున ఆంగ్లంలో 'ఇండియా' అని, రూపాయి గుర్తుతో పెద్దగా రూ.350 అని ఉండనుంది.  


నాణేనికి వెనుక వైపు(బొరుసు) 'తక్త్ శ్రీ హరిమందిర్ జి పాట్నా సాహిబ్' చిత్రం ఉంటుంది. దానిపైన '350వ ప్రకాష్ ఉత్సవ్ ఆఫ్ శ్రీ గురుగోబింద్ సింగ్ జీ' అని లిఖించబడి ఉంటుంది. నాణెం బరువు 34.65 గ్రాముల నుండి 35.35 గ్రాములు. అయితే రూ.350 నాణేలను ఎన్ని ముద్రించారో ఆర్‌బీఐ చెప్పలేదు. అయితే పరిమితంగానే వీటిని ముద్రించినట్లు తెలుస్తోంది.