తిరువనంతపురం: కేరళలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇడుక్కి డ్యామ్‌లోని గేట్లు ఎత్తి నీళ్లు కిందకు వదులుతున్నారు. మరోవైపు ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాల్లో వున్న మరో మూడు డ్యామ్స్ గేట్లు ఇప్పటికే ఎత్తినట్టు తెలుస్తోంది. పెరియార్ నది క్యాచ్‌మెంట్ ఏరియాతోపాటు ఇడుక్కి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో మొత్తం వరద నీరు రిజర్వాయర్‌లోకి పోటెత్తుతోందని సంబంధిత అధికారులు తెలిపారు. కేసర్‌ఘడ జిల్లాలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలు వెలువడే క్రమంలోనే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేస్తారనే సంగతి తెలిసిందే.


అలాగే ఇడుక్కి, కొజికోడ్, కన్నూర్, మలప్పురం, వయనాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. కొల్లం, పఠానమిట్ట, అలప్పుర, కొట్టాయం, ఎర్నాకులం, త్రిశూరు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీచేసింది.