తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి 6వ వరుసలో సీటు కేటాయిస్తారా అని కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్రంపై చేస్తోన్న విమర్శలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. రాహుల్ గాంధీ సీటు కేటాయింపు వివాదంపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహ రావు మీడియాతో మాట్లాడుతూ.. "దేశం అంతా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అనవసర రద్ధాంతాలు చేస్తోంది" అని అన్నారు. మీ ( కాంగ్రెస్ పార్టీ) రాహుల్ గాంధీ సూపర్ వీవీఐపీలా ప్రవర్తిస్తున్నారు. మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం ముందు అందరూ సమానమే. అంతేకానీ ఇక్కడ వ్యక్తులని దృష్టిలో ఉంచుకుని మర్యాదలు చేయడం కుదరదని గుర్తించాలని జీవీఎల్ నరసింహా రావు కాంగ్రెస్ పార్టీ నేతలకు హితవు పలికారు.


ఈ వివాదం విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై అసహనం వ్యక్తంచేసిన జీవీఎల్ నరసింహా రావు.. 'చీప్ పాలిటిక్స్‌తో దేశానికి ఒరిగేదేమీ లేదు' అని అన్నారు. 'దయచేసి ఇకనైనా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చీప్ పాలిటిక్స్‌కి స్వస్తి పలికితే బాగుంటుంది' అని ప్రతిపక్ష పార్టీ నేతలకు విజ్ఞప్తిచేశారు.