హీరో విశాల్ కు ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో చుక్కెదురైంది. ఎన్నికల సంఘం ఆయన వేసిన నామినేషన్ చెల్లదంటూ ఝలక్ ఇచ్చింది. విశాల్ సమర్పించిన నామినేషన్ పత్రాలు అసంపూర్తిగా ఉన్నాయని.. కాబట్టే తిరస్కరించామని ఆర్కేనగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. సోమవారం హీరో విశాల్ అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే...! జయలలిత మరణం తరువాత ఆర్కే నగర్ బైపోల్స్ జరుగుతుండటంతో  రాష్ట్రంలో ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక మీడియా ఛానళ్లు  కూడా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


ఆర్కేనగర్ లో ఎక్కువగా తెలుగువారు ఉన్నారు. విశాల్ తెలుగు అబ్బాయే.. తమిళనాడులో పుట్టిపెరగడంతో అక్కడే సెటిల్ అయ్యారు.  కనుక ఏ ఇతర పార్టీల టికెట్ ఆశిచకుండా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం సమర్పించిన నామినేషన్  పత్రాలు అసంపూర్తిగా ఉందని తిరస్కరించడంతో ఇప్పుడు ఆయన కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంతకు ముందు 'అమ్మ' మేనకోడలు దీపా నామినేషన్ ను కూడా ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఏది ఏమైనప్పటికీ విశాల్ కు ఆదిలోనే ఇలా జరగడంతో బైపోల్ పోటీ ప్రధాన పార్టీల మధ్యే నెలకొంది. ఈ నెల 21న ఆర్కే నగర్ ఉపఎన్నిక జరగనుంది.