Russia Ukraine War: రష్యా యుద్ధ తంత్రం.. మోదీ సాయం కోరిన ఉక్రెయిన్.. జోక్యం చేసుకుంటారా?
Russia Ukraine War: రష్యా దాడులతో విలవిల్లాడుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యాన్ని కోరింది.
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. రాజధాని కీవ్ సహా పలు నగరాల్లో బాంబుల మోత మోగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే 300 మంది వరకు పౌరులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా దాడులు ఇలాగే కొనసాగితే ఉక్రెయిన్ ఉనికికే ముప్పు వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో రష్యా దాడులను ఆపేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా భారత్ సాయాన్ని కూడా ఉక్రెయిన్ కోరింది. ఈ మేరకు భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి ఇగర్ పోలిఖా ఒక ప్రకటన చేశారు.
'రష్యాతో భారత్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం రీత్యా ఉక్రెయిన్-రష్యా సంక్షోభాన్ని నియంత్రించడంలో భారత్ కీలకంగా వ్యవహరించగలదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీలతో సంప్రదింపులు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాం.' అని పోలిఖా పేర్కొన్నారు. మరోవైపు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇతరులు జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని పుతిన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ స్పందన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలపై స్పందించిన భారత్.. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని, శాంతికి కట్టుబడి ఉండాలని పేర్కొంది.
నిజానికి ఉక్రెయిన్‌పై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని పుతిన్‌తో పాటు రష్యా వర్గాలు పదేపదే చెప్పాయి. కానీ గురువారం పుతిన్ ఆదేశాలతో (ఫిబ్రవరి 24) రష్యా వైమానిక బలగాలు ఉక్రెయిన్‌పై అకస్మాత్తుగా దాడులకు దిగాయి. రాజధాని కీవ్ సహా పలు నగరాల్లో బాంబుల మోత మోగిస్తోంది. దీంతో ఉక్రెయిన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియక.. ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియక అల్లాడిపోతున్నారు.
పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌ని నాటోలో చేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తుండటం... దానిపై పుతిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండటమే ఈ పరిణామాలకు దారితీసింది. ఉక్రెయిన్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో చేర్చుకోవద్దని.. ఆ విషయంలో రష్యాకు గట్టి హామీ కావాలని పుతిన్ పట్టుబడుతున్నారు. ఇందుకు అమెరికా, నాటో దేశాలు అంగీకరించకపోవడంతో పుతిన్‌లో భయం మొదలైంది. ఉక్రెయిన్ నాటోలో చేరితే అది రష్యాకు ప్రమాదమని భావిస్తున్న ఆయన... ఈ క్రమంలో యుద్ధానికి తెరలేపారు.
Also Read: Flipkart iPhone SE Sale: రూ.40,000 విలువైన iPhone ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో రూ.13 వేలకే విక్రయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook