భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మరియు రాజ్యసభ సభ్యుడైన భారతరత్న సచిన్ టెండుల్కర్ దిగువసభలో చేయాల్సిన ప్రసంగం వివాదాస్పదమైంది. ఎంపీగా సచిన్ ఇప్పటికే సభకు అనేకసార్లు గైర్హాజరు అయ్యారని గతంలో పలువురు మంత్రులు ఫిర్యాదు చేసిన క్రమంలో ఎట్టకేలకు ఆయన సభకు హాజరయ్యారు. భారతదేశంలో క్రీడల అభ్యున్నతి అనే అంశంపై ఆయన ఈ రోజు ప్రసంగించాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆయన ప్రసంగం సాగించారో లేదో.. కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని.. ఆయన సభకు వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పెద్దగా అరుస్తూ స్లోగన్స్ కూడా చేశారు. ఈ క్రమంలో ప్రసంగం చేసేందుకు నిలుచుకున్న సచిన్ అలాగే చాలాసేపు నిల్చుండిపోయారు. 


ఆయన అప్పీలు చేసుకున్నా.. ఆ గొడవలో ఆయనను పట్టించుకొనేవారే లేకపోయారు. పరిస్థితి గమనించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాంగ్రెస్  నేతలకు సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. భారతదేశ ఖ్యాతిని జగద్విఖ్యాతం చేసిన ఓ క్రీడాకారుడు సభను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, కనీస గౌరవం చూపమని.. సభను నడిపేందుకు సహకరించాలని ఆయన కోరారు.


అయితే కాంగ్రెస్ నేతలు వినకుండా గొడవ చేయడంతో, ఉప రాష్ట్రపతి సభను వాయిదా వేశారు. సచిన్ కూడా ఏమీ మాట్లాడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విషయంపై బయటకు వచ్చాక ఎంపీ జయ బచ్చన్ మాట్లాడారు. ఈ రోజు సభలోని ఎంపీలందరూ సిగ్గుపడాల్సిన విషయం. ఒక గౌరవప్రదమైన వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వారు సంస్కారం లేకుండా ప్రవర్తించడం సిగ్గుచేటు అని ఆమె అభిప్రాయపడ్డారు.