ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ ఫ్యాక్టరీ యూపీలో ప్రారంభం
ప్రపంచలోనే అతి పెద్ద మొబైల్ ఫ్యాక్టరీని శాంసంగ్ సంస్థ ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించింది.
ప్రపంచలోనే అతి పెద్ద మొబైల్ ఫ్యాక్టరీని శాంసంగ్ సంస్థ ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించింది. ఈ సంస్థను సందర్శించడానికి సోమవారం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా నోయిడా రానున్నారు. శాంసంగ్ సంస్థకు చెందిన ఈ ఫ్యాక్టరీ సెక్టార్ 81లో గల 35 ఎకరాల ఎలక్ట్రానిక్స్ ఫెసిలిటీ సెంటరులో నెలకొల్పబడింది. శాంసంగ్ సంస్థకి చెందిన తొలి ప్లాంట్ నోయిడాలో 1996లో ప్రారంభమైంది.
1997లో టెలివిజన్ తయారీకి కూడా ఇదే సంస్థ ఇక్కడ శ్రీకారం చుట్టింది. 2005లో తొలిసారిగా మొబైల్ ఫోన్ తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. 2018లో అతి పెద్ద మొబైల్ ఫ్యాక్టరీకి నాంది పలికింది. 2012లో శాంసంగ్ భారతదేశంలో మొబైల్ తయారీ రంగంలో తిరుగులేని దిగ్గజంగా సత్తా చాటింది. ముఖ్యంగా శాంసంగ్ గెలక్సీ 3 ఫోన్ మార్కెట్‌లో విడుదలయ్యాక.. ఈ బ్రాండ్ బాగా జనాల్లోకి వెళ్లింది. మధ్య తరగతి వినియోగదారులను కూడా శాంసంగ్ బాగా ఆకట్టుకుంది.
2017లో తొలిసారిగా శాంసంగ్ నోయిడాలోని స్మార్ట్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్ల యూనిట్లలో తయారీ ఉత్పత్తిని పెంచడానికి దాదాపు రూ.4,915 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. ఈ ఉత్పత్తి శాతం పెరిగితే మరో 5000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని కూడా సంస్థ అప్పట్లో తెలిపింది. నోయిడా శాంసంగ్ సంస్థకి సంబంధించి ప్రధాన కేంద్రం కాగా.. తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో తయారీ యూనిట్ ఒకటి ఉంది. భారతదేశంలో దాదాపు 70,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా శాంసంగ్ సంస్థ ఉపాధి కల్పిస్తోంది. ఇటీవలే యూపీ ప్రభుత్వపు మెగా పాలసీలో భాగంగా శాంసంగ్ కంపెనీకి చెందిన పెట్టుబడి ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించింది.