సర్దార్ వల్లభాయ్ పటేల్ ను విస్మరించారు: ప్రధాని మోదీ
భారతదేశ వ్యాప్తంగా ఉక్కుమనిషి, మాజీ ఉప ప్రధాని, దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. దిల్లీలో సర్దార్ వల్లభాయ్‌పటేల్ స్మారక స్థూపం వద్ద రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లు ఘనంగా నివాళులు అర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా దివస్‌ను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ప్రధాని యునిటీ రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ లో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.
మనం ఇప్పుడు చూస్తున్న సమైక్య భారత్.. సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఫలితమేనని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను విస్మరించారని కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడారు. దేశమంతా ఐక్యంగా ఉండాలని అన్నారు. అభివృద్ధిలో రాష్ట్రాలు ఒకరినొకరు సమన్వయము చేసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేశాన్ని విడగొట్టాలని ఎవరెన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, అది జరగదని అన్నారు. ఇలాంటి సమయంలోనే మనమంతా ఐక్యంగా ఉంటూ, దేశ సమగ్రతను కాపాడాలని కోరారు.