శాతవాహనులంటే.. ఏడు వాహనాలు నడిపేవారట..!
మీకు శాతవాహనులంటే ఎవరో తెలుసా.. మీకు తెలియకపోతే వారిని అడగండి.. శాతవాహనులంటే ఏడు వాహనాలు నడిపే వారట.
మీకు శాతవాహనులంటే ఎవరో తెలుసా.. మీకు తెలియకపోతే వారిని అడగండి.. శాతవాహనులంటే ఏడు వాహనాలు నడిపే వారట. అవి ఏవైనా కావచ్చంట. కారు, సైకిల్, బస్సు, లారీ, రైలు, ట్రాము.. ఆఖరికి విమానాన్ని కూడా వదలిపెట్టలేదు. బిహార్‌కి చెందిన భూపేంద్ర నారాయణ్ మండల్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన బిఏ పార్ట్ 1 చరిత్ర పరీక్షలో అధిక మొత్తంలో విద్యార్థులు రాసిన ఈ సమాధానాలు చదివాక, ఆశ్చర్యపోవడం అధ్యాపకుల వంతైంది.
ఒకరిద్దరు కాదు.. దాదాపు వేల సంఖ్యలో విద్యార్థులు ఇదే జవాబు రాయడం చూసి కంగుతినడం యూనివర్సిటీ వారి వంతైంది. విశ్వవిద్యాలయంలో బోధన పట్ల కూడా వారికి అనుమానం తలెత్తింది.
కనీసం పాఠ్యపుస్తకాలు కూడా చదవకుండా.. కాలేజీకి హాజరవకుండా రెగ్యులర్‌గా అధిక మొత్తంలో విద్యార్థులు పరీక్షలు రాయడమే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నా.. మరి అలాంటప్పుడు కళాశాల యాజమాన్యాలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్న కూడా తలెత్తుతుందని బీహార్ విద్యాశాఖకు చెందిన ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.
గత సంవత్సరం బీహార్ ఇంటర్ బోర్డు పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన రూబీ రాయ్‌ని మీడియా ప్రశ్నిస్తూ.. పొలిటికల్ సైన్స్ అంటే ఎందుకు అంత ఇష్టం అని ప్రశ్నించినప్పడు.. అది వంటలకు సంబంధించిన శాస్త్రం అని చెప్పడంతో కంగుతినడం జనాల వంతైంది. కనీసం పొలిటికల్ సైన్స్ అంటే కూడా ఏమిటో తెలియని విద్యార్థిని టాపర్ ఎలా అయ్యిందని.. ఎంక్వయరీ చేయించగా.. ఆమె తల్లిదండ్రులు బోర్డులో కొందరు ఉద్యోగులకు డబ్బులిచ్చి పాస్ చేయించారని తెలియడంతో.. బోర్డుపైనే ఎంక్వయరీ వేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.