వడ్డీ రేటు తగ్గించిన ఎస్‌బీఐ
25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తున్నట్టుగా ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయం రేపటి నవంబర్ 1 నుంచి అమలులోకి రానుంది.
సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కోత విధించి ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తున్నట్టుగా ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయం రేపటి నవంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో నవంబర్ 1వ తేదీ నుంచి ఎస్‌బీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ కలిగి వున్న కస్టమర్లకు 3.5 శాతం వడ్డీ రేటుకు బదులుగా 3.25 శాతం మాత్రమే వడ్డీ లభించనుంది. అయితే, లక్ష రూపాయల వరకు డిపాజిట్లు ఉన్న అకౌంట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందనే విషయాన్ని ఖాతాదారులు గమనించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ స్పష్టంచేసింది. అంతకన్నా ఎక్కువ మొత్తంలో వున్న డిపాజిట్స్‌పై వడ్డీ రేటులో ఎటువంటి మార్పు లేదని ఎస్‌బిఐ పేర్కొంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన రెపో రేటును తగ్గించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇటీవల రెటో రేటును 25 బేసిస్ పాయింట్స్‌కి తగ్గించడంతో ప్రస్తుతం రెపో రేటు 5.15 శాతంగా ఉంది. ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు 0.10 శాతం తగ్గుదలతో 6.4 శాతానికి దిగొచ్చాయి. ఇదిలావుంటే, ఇప్పటికే ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే.