ఎస్సీ, ఎస్టీ పదోన్నతులకు సుప్రీం పచ్చజెండా
కేంద్రానికి సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది.
కేంద్రానికి సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన ఉద్యోగులకు చట్ట ప్రకారం పదోన్నతులు కల్పించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్స్ విషయంలో సందిగ్దత నెలకొనడంతో కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
పదోన్నతులకు సంబంధించి 2015లో ఆయా హైకోర్టులు, సుప్రీం ధర్మాసనం కూడా స్టేటస్ కో విధించటంతో ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. దీంతో ఢిల్లీ, ముంబై, పంజాబ్,హర్యానా హైకోర్టులను ఆశ్రయించగా ఎస్సీ, ఎస్టీ పదోన్నతుల విషయంలో విభిన్న తీర్పులు వచ్చాయని కేంద్రం తెలిపింది. అప్పీల్ విషయంలో సుప్రీం ధర్మాసనం కూడా భిన్నంగా స్పందించిందని కేంద్రం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
దీంతో కేంద్రం అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం న్యాయమూర్తులు పదోన్నతులకు పచ్చజెండా ఊపింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) మణీందర్ సింగ్‌తో సుప్రీం న్యాయమూర్తులు ఆదర్శ్‌కుమార్ గోయల్, అశోక్ భూషణ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతికి సంబంధించి చట్టప్రకారం ముందుకు వెళ్లాలని.. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ పదోన్నతుల ప్రక్రియ కొనసాగించవచ్చని తెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన పాశ్వాన్
సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రమంత్రి, లోక్‌జన్‌శక్తి పార్టీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ స్వాగతించారు. కేసును ధర్మాసనం ముందుకు తీసుకెళ్లడంలో చొరవ చూపిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు.