కర్ణాటక రాజకీయాలలో రెండు మూడు రోజులుగా అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమస్య రేపు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సీఎంగా యడ్యూరప్ప చేసిన ప్రమాణ స్వీకారాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాయి. ఆ పిటీషన్‌ను విచారించిన కోర్టు శనివారం నాడు ఇరు పార్టీలు శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాలని తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకవేళ ఏవైనా సెక్యూరిటీ సమస్యల వల్ల ఎమ్మెల్యేలు హాజరు కాలేకపోతే.. డీజీపీ పూర్తిస్థాయి భద్రత కల్పిస్తారని తెలిపింది. ఈ రోజు కోర్టులో యడ్యూరప్ప గవర్నరుకు అందించిన లేఖను కోర్టులో సమర్పించాలని తెలిపింది. ఆ తర్వాత గవర్నరు తీసుకొన్న నిర్ణయం పట్ల కూడా కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ సమస్య ఒక కొలిక్కి రావాలంటే బలపరీక్ష ఒక్కటే మార్గమని తెలిపింది. అయితే బలపరీక్ష విషయంలో తమకు కొంత సమయం ఇవ్వాలని బీజేపీ తరఫు న్యాయవాది కోరారు. 


అయితే బీజేపీ తరఫు న్యాయవాది అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఇక కోర్టు తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్‌-జేడీఎస్‌ పార్టీలు తమ అంగీకారాన్ని తెలిపాయి. రేపు సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష జరగనుంది. ఏకే సిక్రీ, ఎస్ ఏ బాబ్డీ, అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ప్రకటించింది. ఈ ఫ్లోర్ టెస్టు ఎలా జరగాలన్నది ప్రొటెం స్పీకరు నిర్ణయిస్తారని కూడా కోర్టు తెలిపింది. ఈ క్రమంలో తాము ఫ్లోర్ టెస్టుకి సిద్ధమని కాంగ్రెస్, జేడీఎస్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింగ్వి తెలిపారు. ఆ ఫ్లోర్ టెస్టు మొత్తం వీడియా ద్వారా చిత్రీకరించాలని కోర్టును కోరారు. కానీ కోర్టు ఆ అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది.