న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి లాంటి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోడానికి ప్రజల నుండి పారిశ్రామిక వేత్తల నుండి విరాళాలు సేకరించడానికి వీలుగా ఈ ఫండ్‌ను కేంద్రం మార్చి 28 న ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 


ఇందుకు గాను ప్రధాని ఎక్స్‌అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని, రక్షణ, హోం, ఆర్థిక మంత్రులు ఎక్స్ అఫీషియో ట్రస్టీలుగా ఉంటారని తెలిపింది. ఈ ఫండ్ ఏర్పాటు రాజ్యాంగ బద్ధంగా జరగలేదని ఆరోపిస్తూ న్యాయవాది ఎంఎల్ శర్మ వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ఆర్టికల్ 287 ప్రకారం పార్లమెంటు కానీ, రాష్ట్ర శాసన సభ కానీ ఈ ఫండ్‌ను ఏర్పాటు చేయ లేదని పిటిషన్‌దారుడు ఆరోపించారు. అలాగే రాష్ట్రపతి కానీ, పార్లమెంట్ కానీ ఆమోదించలేదని ఈమేరకు ఆర్డినెన్సు కానీ గెజిట్ నోటిఫికేషన్ జారీ కాలేదని పేర్కొన్నారు. ఈ ఫండ్ కింద ఇంతవరకు వసూలైన విరాళాలను కన్సాలిడేటెడ్ ఫండ్‌ ఆఫ్ ఇండియాకు బదిలీ చేయాలని కోరారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..