గో సంరక్షణ పేరుతో పలువురు దాడులు చేయడంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఇలా దాడికి దిగడం సరైంది కాదని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 'వ్యక్తిగతంగా ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు. భయం, అరాచకత్వం పేరుతో ఇతరులపై దాడులు చేయడం సరికాదు. దీనిపై అన్ని రాష్ట్రాలు స్పందించాలి. హింస చెలరేగకుండా అరికట్టాలి' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పార్లమెంట్‌లో కొత్త  చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొంతకాలంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల గో సంరక్షణ పేరుతో దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. గోవులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలతో కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వ్యక్తులపై దాడులు చేస్తూ చంపేస్తున్నారు. దీంతో ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.


వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పైవిధంగా స్పందించిన తరువాత.. చట్టాన్ని ఎవరూ చేతుల్లో తీసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని చట్టాన్ని రూపొందించాలని.. ఎలాంటి చట్టం చేస్తున్నారో తమకు నాలుగువారాల్లో నివేదించాలని కోరింది. సమాజంలో హింసకు తావులేదన్న ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్ట్‌ 28కి వాయిదా వేసింది.