ఎస్సీ,ఎస్టీ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రేపు భారత్ బంద్
ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళలను మిన్నంటాయి.
ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళలను మిన్నంటాయి. ఎన్నికలకు రెడీ అవుతున్న మధ్యప్రదేశ్‌లో రిజర్వేషన్ వ్యతిరేక ర్యాలీ ఊపందుకుంది. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ మధ్యప్రదేశ్‌లో ఆందోళనలు చెలరేగాయి. ఉన్నత వర్గాలకు చెందిన(పరశురామ్ సేన, క్షత్రియ మహాసభ, కర్ణి సేన తదితరులు) వేలాదిమంది రోడ్లపైకి వచ్చి ధర్నాకు దిగారు. దీంతో మధ్య ప్రదేశ్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.
గత నెలలో పార్లమెంటులో ఆమోదం పొందిన SC/ST సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దాదాపు 35 సంస్థలు 'భారత్ బంద్'కు పిలుపునిచ్చాయి. మధ్యప్రదేశ్ పోలీసులు రాష్ట్రంలోని మొరెనా, శివపురి, భింద్, అశోక్ నగర్ జిల్లాల్లో నిషేధాజ్ఞలను అమలు చేయనున్నారు. ఈ జిల్లాలు చంబల్-గ్వాలియర్ ప్రాంతంలో ఉన్నాయి. ఏప్రిల్ 2న దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ సమయంలో ఈ ప్రాంతంలో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు నిషేధాజ్ఞలను అమలు చేయనున్నారు. సెప్టెంబరు 6న బంద్ దృష్ట్యా పోలీసుల సూపరింటెండెంట్లను అప్రమత్తం చేసినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఇంటెలిజెన్స్) మక్రాండ్ డ్యూస్కర్ చెప్పారు.
కాగా ఏ ఒక్కరూ చట్టాన్ని దుర్వినియోగపరచడానికి అనుమతించబోమని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. రిజర్వేషన్ వ్యతిరేక ర్యాలీలు, ఎస్సీ, ఎస్టీ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు దేశవ్యాప్తంగా జరిగే అవకాశాలున్నట్లు కొందరు అనుమానిస్తున్నారు.