పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. అక్కడ పాక్ ఆర్మీ ఛీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాని కౌగలించుకోవడం ఓ దుశ్చర్య అని.. ఈ పనిచేసినందుకు సిద్ధూకు భారత ప్రభుత్వం మరణశిక్ష విధించినా తప్పు లేదని బీజేపీ మైనార్టీ మోర్చా నేత అఫ్తాబ్ అద్వానీ అన్నారు. ఇలాంటి పనులు చేస్తే.. భారత ప్రజలు సిద్ధూని క్షమించరని ఆయన తెలిపారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నివాళి కార్యక్రమం కన్నా.. ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమమే సిద్ధూకి ముఖ్యమైపోయిందని.. అలాంటి వ్యక్తులకు భారతదేశంలో చోటు కల్పించకూడదని అఫ్తాబ్ అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే పాక్ ఆర్మీ ఛీఫ్ జనరల్‌ను తాను హగ్ చేసుకున్న విషయంపై సిద్ధూ వివరణ ఇచ్చారు. "జనరల్ నన్ను కౌగలించుకొని ఒకే మాట చెప్పారు. ఇది శాంతిని పునరుద్ధరించుకొనే సమయం అని అన్నారు. అదే నా కల కూడా అన్నాను. తర్వాత ఆయన ఉదయం కలసినప్పుడు ఓ విషయాన్ని తెలిపారు. గురు నానక్ దేవ్ 550 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కతర్ పుర్ ప్రాంతానికి రూట్ వేయాలని భావిస్తున్నట్లు తెలిపారు" అని సిద్ధూ తెలిపారు. 


సిద్ధూ చర్యపై జమ్ము కాశ్మీర్ కాంగ్రెస్ నేత గులామ్ అహ్మద్ మీర్ కూడా స్పందించారు. సిద్ధూ ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తని... ప్రస్తుతం పంజాబ్‌లో మంత్రి హోదాలో పనిచేస్తున్నారని.. అలాంటి వ్యక్తి వెళ్లి పాకిస్తాన్ ఆర్మీ జనరల్‌ను కౌగలించుకోకుండా ఉంటే బాగుండేదని అన్నారు. అలాగే హర్యానా మంత్రి అనిల్ విజ్ కూడా సిద్ధూ చర్యపై మండిపడ్డారు. ఇలాంటి పనులు చేస్తే ఎవరూ సమర్థించరని.. ఆయనను భారత ప్రజలు విశ్వాసం లేని వ్యక్తిగా చూస్తారని తెలిపారు.