ముంబై: భారీ వర్షాలు ముంబైని వరదలతో అతలాకుతలం చేస్తున్నాయి. ముంబైలోనే కాకుండా మహారాష్ట్రలోని పలు లోతట్టు ప్రాంతాలు వరదల తాకిడికి ముంపునకు గురవుతున్నాయి. ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకెందరో గాయాలపాలయ్యారు. తాజాగా మహారాష్ట్రలోని రత్నగిరి ఆనకట్టకు గండిపడి వరద నీరు పోటెత్తిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరో 18 మంది గల్లంతయ్యారు. రత్నగిరిలో ఉన్న తివారీ ఆనకట్టుకు మంగళవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో గండి పడడంతో వరదనీరు ఒక్కసారిగా సమీపంలోని ఏడు గ్రామాలను ముంచెత్తింది. వరద కారణంగా 12 ఇళ్లు కూలిపోయాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. 


ఘటనపై సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలింపు మొదలుపెట్టాయి. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను వెలికి తీసినట్టు తెలుస్తోంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.