ముజఫర్‌పూర్: ఎన్నికలు పూర్తయిన తర్వాత మూడంచెల భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాల్సిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు హోటల్ రూమ్‌లో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది ? అదేంటి ? ఎన్నికలు పూర్తయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్‌కి వెళ్లాల్సిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు హోటల్ రూమ్‌కి ఎలా వెళ్తాయనే కదా మీ సందేహం ? కానీ బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో సరిగ్గా అదే జరిగింది. ఈవీఎంలు, వీవీప్యాట్‌లకు ఉన్న భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ ఆరు ఈవీఎంలు, వీవీప్యాట్‌లు హోటల్‌లో లభించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ముజఫర్‌పూర్ ఎస్డీఓ కుందన్ కుమార్ ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 


ఈవీఎంలు హోటల్లో ఎందుకు ఉన్నాయి, అక్కడకు ఎవరు తరలించారని ఆరా తీయగా.. పోలింగ్ విధుల్లో ఇంచార్జ్‌గా ఉన్న స్థానిక సెక్టార్ మెజిస్ట్రేట్ అవ్‌ధేష్ కుమార్ తన కారు డ్రైవర్ ఓటు వేయడానికి వెళ్లి అందుబాటులో లేని కారణంగా ఆ ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను హోటల్‌కి తరలించాడని తెలుసుకున్న స్థానికులు మెజిస్ట్రేట్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో పోలింగ్ అధికారి అవ్‌ధేష్ కుమార్‌కి ఉన్నతాధికారుల నుంచి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.