నేర నేతలకు ఇక రంగు పడుద్ది..
ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
ప్రజాప్రతినిధులకు సంబంధించి కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు కేంద్రం సమ్మతించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు 14 పేజీల ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా 12 చోట్ల ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ప్రజా ప్రతినిధుల కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఆవశ్యకతను తెలుపుతూ అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రతినిధుల వాజ్యంపై కేంద్రం తన స్పందనను ఈ విధంగా తెలిపింది.
నేతల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాల్సింద్సింగా నవంబర్‌లో జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ సిన్హాల ధర్మాసనం కేంద్రానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం ఉత్తర్వుల మేరకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చింది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించి 1571 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏడాదిలోగా ఇవ్వన్నీ తేలాల్సి ఉంటుంది. ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఎన్ని కేసులు విచారణలో ఉన్నాయో తెలిపే పూర్తి సమాచారం తమ వద్ద లేదని.. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారం రావాల్సి ఉందని కేంద్రం పేర్కొంది. వాటిని క్రోడీకరించి దాని ఆధారంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలుపుతూ..ఈ ప్రక్రియ అమలు కోసం కేంద్రం మరింత సమయాన్ని కోరింది.
శిక్షలు పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేదాన్ని విధించాలని ఎన్నికల సంఘం గత నెలలో అభిప్రాయపడింది. నేరమయ రాజకీయలకు అడ్డకట్ట వేసేందుకు చట్టం అవసరమని ఈసీ పేర్కొంది. దీనికి తోడు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన తాజా నిర్ణయంతో నేర నేతలకు చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టినట్లయింది.