ముంబైకి చేరుకున్న శ్రీదేవి భౌతికకాయం.. బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు
దుబాయ్‌లోని జుమేరియా ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో ఫిబ్రవరి 24న అర్ధరాత్రి శ్రీదేవి మృతిచెందగా, ఆ తర్వాత నాలుగు రోజులకు మంగళవారం రాత్రి ఆమె భౌతికకాయం ప్రత్యేక ప్రైవేట్ జెట్ విమానంలో ముంబైకి చేరుకుంది.
బాలీవుడ్ నటి శ్రీదేవి భౌతికకాయం దుబాయ్ నుంచి ముంబైకి చేరుకుంది. దుబాయ్‌లోని జుమేరియా ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో ఫిబ్రవరి 24న అర్ధరాత్రి శ్రీదేవి మృతిచెందగా, ఆ తర్వాత నాలుగు రోజులకు మంగళవారం రాత్రి ఆమె భౌతికకాయం ప్రత్యేక ప్రైవేట్ జెట్ విమానంలో ముంబైకి చేరుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానికి చెందిన సొంత ప్రైవేట్ జెట్ విమానం సోమవారం మధ్యాహ్నానికే దుబాయ్ ఎయిర్ పోర్టుకి చేరుకుంది. వాస్తవానికి సోమవారం మధ్యాహ్నమే శ్రీదేవి భౌతికకాయంతో ఆ విమానం తిరిగి ముంబైకి బయల్దేరుతుందని అందరూ అనుకున్నారు. అయితే, శ్రీదేవి మృతిచెందిన తీరు అనేక అనుమానాలకు తావివ్వడంతోపాటు ఆమె ఒక సెలబ్రిటీ కావడంతో దుబాయ్ ప్రభుత్వం, అక్కడి అధికార యంత్రాంగం తమ చట్టాలకు అనుగుణంగా, నియమనిబంధనలకు లోబడి తర్వాతి ప్రక్రియ పూర్తి చేయడంతో శ్రీదేవి భౌతికకాయాన్ని ఆమె భర్త బోనీకపూర్‌కి అప్పగించడంలో ఇంత జాప్యం జరిగింది.
శ్రీదేవి భౌతికకాయానికి శవపరీక్ష పూర్తి చేసి, ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్ట్, డెత్ సర్టిఫికెట్ జారీ చేయడంతోపాటు మృతికి దారితీసిన పరిస్థితులపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టేందుకు దుబాయ్ ప్రభుత్వం తీసుకున్న సమయం ఆమె కుటుంబసభ్యులకి, అభిమానులకు కొంత అసహనానికి గురిచేసి వుండవచ్చేమో కానీ పరాయి దేశంలో చనిపోయిన వాళ్లకు ఎవ్వరికైనా ఇంచుమించు అధికారిక ప్రక్రియ ఇంతే వుంటుంది అనేది అందరు గ్రహించాల్సిన విషయం.