నీట్ పరీక్షకు హాజరైన తన చేత బలవంతంగా లో దుస్తులు విప్పేయించారు: బాధిత విద్యార్థిని
పరీక్ష రాయడానికి వెళ్తే పరువు తీశారని వాపోయిన విద్యార్థిని
మే 6న సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) నిర్వహించిన నీట్ ( నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షకు హాజరైన తన చేత బలవంతంగా లో దుస్తులు(బ్రా) విప్పేయించారని వాపోయారు కేరళలోని పాలక్కడ్‌కి చెందిన ఓ విద్యార్థిని. ఇదే విషయమై తాజాగా ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. బ్రాలో లోహపు హుక్కు వుందనే కారణంతో తనతోపాటు ఇతర విద్యార్థినుల లో దుస్తులు బలవంతంగా విప్పేయించారని, ఆ పరీక్ష కేంద్రానికి ఎక్స్‌టర్నల్ అబ్జర్వర్‌గా వ్యవహరించిన వ్యక్తి, మేల్ ఇన్విజిలేటర్ పదే పదే తనని తదేకంగా చూసి ఇబ్బందికి గురిచేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మేల్ ఇన్విజిలేటర్ పదే పదే తన వద్దకు వచ్చి తన ముఖాన్ని కాకుండా తన శరీరాన్నే గుడ్లప్పగించి చూడటం తనకు ఎంతో ఇబ్బందిగా అనిపించింది అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 509 ( మాటలు, సైగలతో వేధించడం లేదా మహిళలను కించపర్చేలా అసభ్యంగా ప్రవర్తించిన నేరం) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మేల్ ఇన్విజిలేటర్ తనను గుడ్లప్పగించి చూస్తోంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రశ్నాపత్రాన్ని శరీరానికి అడ్డుపెట్టుకుని పరీక్ష రాయాల్సి వచ్చిందని బాధితురాలు ఆరోజు పడిన అవస్థలను గుర్తుచేసుకున్నారు. మేల్ ఇన్విజిలేటర్ వైఖరి కారణంగా తన సోదరి ఎంతో మానసిక వేదనకు గురయ్యారని, పరీక్ష కూడా సరిగ్గా రాయలేకపోయారని బాధితురాలి సోదరి మీడియాకు తెలిపారు. బాధితురాలు పేర్కొన్న వివరాల ప్రకారం కొప్పలోని లయన్స్ స్కూల్ పరీక్ష కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు పీటీఐతో మాట్లాడుతూ.. అదే పరీక్ష కేంద్రంలో పరీక్షకు హాజరైన ఇతర విద్యార్థినుల నుంచి తాము మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే, ఈ వ్యవహారంపై స్పందించిన సీబీఎస్ఈ.. అటువంటి ఘటనలు చోటుచేసుకున్నట్టుగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు అని తేల్చిచెప్పింది. పోలీసు ఫిర్యాదుపై సీబీఎస్ఈ రీజినల్ ఆఫీసర్ తరుణ్ కుమార్ స్పందిస్తూ.. తాము శాఖాపరమైన విచారణకు ఆదేశించామని, వచ్చే వారం నివేదిక అందుతుందని చెప్పారు.