'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ 3.0 రేపటితో ముగియనుంది. ఐతే ఇప్పటి వరకు కరోనా వైరస్ మహమ్మారి లొంగి రాలేదు. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 4 వేలకు చేరింది. గత 24 గంటల్లో 3 వేల 970 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కారణంగా లాక్ డౌన్ పొడగించాల్సిన అవసరం ఉంది. ఐతే దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ స్ఫష్టంగా ప్రకటించారు. మే 17 న  లాక్ డౌన్ 3.0  పూర్తయిన తర్వాత కూడా లాక్ డౌన్ 4.0 అమలులో ఉంటుందని ప్రకటించారు. దీంతో ప్రధాని కార్యాలయం  సూచననల మేరకు దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ ఈ రోజు ప్రకటించనుంది. 


లాక్ డౌన్ 4.0 పూర్తి భిన్నంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు. కరోనా మహమ్మారితో పోరాడాలంటే లాక్ డౌన్ తప్పనిసరిగా అమలులో ఉండాలని స్పష్టం చేశారు. ఐతే లాక్ డౌన్ 4.0 ఎలా ఉండాలనే దానిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద అభిప్రాయాలు సేకరించారు. ఎలాంటి నిబంధనలు అమలు చేయాలి..? ఎలా సడలింపులు ఇవ్వాలి..? అనే విషయాలను వారితో చర్చించారు. దీనికి అనుగుణంగా ఇవాళ కొత్త మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. 


లాక్ డౌన్ 4.0 కొత్త మార్గదర్శకాల్లో భాగంగా రాష్ట్రాల్లో ప్రజారవాణా వ్యవస్థకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే గ్రీన్ జోన్ జిల్లాల్లో ట్యాక్సీలు, ఆటోలు తిరిగేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. అంతే కాదు ఫ్యాక్టరీలు, పరిశ్రమలు తిరిగి ఉత్పత్తి ప్రారంభించేలా అనుమతులు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ పరిశ్రమల్లో పని చేసే కార్మికుల రక్షణ కోసం చర్యలు తీసుకునేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తారు. ఇప్పటి వరకు మూసివేసి ఉన్న హార్డ్ వేర్ షాపులు లాక్ డౌన్ 4.0లో తిరిగి తెరుచుకునే అవకాశం ఉంది.  


అలాగే ఇప్పటి వరకు వలస కార్మికుల కోసం ప్రత్యేక శ్రామిక్ రైళ్లు నడిపిస్తున్నారు. సాధారణ ప్రయాణీకుల కోసం పరిమిత సంఖ్యలో ప్రయాణీకుల రైళ్లు తిరిగి పట్టాలెక్కాయి. ఐతే లాక్ డౌన్ 4.0లో  వీటి సంఖ్య  మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ అన్ని  రూట్లలో ఇప్పుడే సాధారణ పరిస్థితి వచ్చే అవకాశం లేదని రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. 


మొత్తంగా కరోనా వైరస్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే ఉద్దేశ్యంగా లాక్ డౌన్ 4.0 అమలు చేయనున్నారు. అదే సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ 4.0 నిబంధనలు అమలు చేస్తారు. ముఖ్యంగా అందరూ సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటారు. ముఖానికి మాస్కులు తప్పనిసరిగా ధరించాలనే నిబంధన అమలులో  ఉంటుంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..