సునంద పుష్కర్ మృతి కేసు: శశిథరూర్‌కు బెయిల్ మంజూరు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌కు బెయిల్ మంజూరైంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌కు బెయిల్ మంజూరైంది. తన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో నిందితుడిగా ఉన్న శశిథరూర్‌కు సాధారణ బెయిల్ మంజూరైంది. నేడు పాటియాలా కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగిన అనంతరం శశిథరూర్‌కు కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేనిదే విదేశాలకు వెళ్లొద్దని ఆదేశించింది. సునంద పుష్కర్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) శశిథరూర్‌పై 3000 పేజీలతో ఛార్జిషీటు దాఖలు చేసిన అనంతరం కోర్టు ఆయనను జులై 7న విచారణకు హాజరవ్వాల్సిందిగా సమన్లు పంపింది.
2014 జనవరి 17న సునంద పుష్కర్ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె చనిపోవడానికి రెండ్రోజుల ముందే పుష్కర్ తన భర్త థరూర్‌కు, పాకిస్థాన్ జర్నలిస్ట్‌తో సంబంధం ఉందని ఆరోపిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని, హింసించారని శశిథరూర్‌పై ఆరోపణలు ఉన్నాయి. సునంద చనిపోయే ముందు చేసిన ఈమెయిల్స్, సంక్షిప్త సందేశాలు, సోషల్ మీడియా పోస్ట్‌లన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.