న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన సునీల్ అరోరా నేడు న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో తన బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈ స్థానంలో కొనసాగిన ఓపీ రావత్ శనివారమే పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో సునీల్ అరోరాను నియమిస్తూ ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాలు జారీచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలతోపాటు జమ్మూ కశ్మీర్, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాల ఎన్నికలను సునీల్ అరోరా పర్యవేక్షించనున్నారు. 


రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన 1980 బ్యాచ్‌ ఐఏఎస్ అధికారి అయిన అరోరా ఇప్పటి వరకు సమాచార ప్రసారాల శాఖతో పాటు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖల కార్యదర్శి హోదాల్లో సేవలు అందించారు. ప్రస్తుతం 62 ఏళ్ల వయస్సున్న సునీల్ అరోరా ఎన్నికల సంఘం అధికారులు అందరికన్నా సీనియర్ అధికారిగా గుర్తింపుపొందారు. ఆర్ధిక, జౌళి, ప్లానింగ్ కమిషన్ సహా పలు ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖల్లోనూ సునీల్ అరోరా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.