`పద్మావత్` విడుదల చేయాల్సిందే: సుప్రీంకోర్టు
పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారిన `పద్మావత్` చిత్రాన్ని పలు రాష్ట్రాలు నిషేధించిన విషయం మనకు తెలిసిందే.
పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారిన 'పద్మావత్' చిత్రాన్ని పలు రాష్ట్రాలు నిషేధించిన విషయం మనకు తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన సుప్రీంకోర్టు ఆ నిషేధాలు చెల్లవని మరోమారు బల్లగుద్ది చెప్పింది. 'బండిట్ క్వీన్' లాంటి చిత్రానికే ఒకప్పుడు విడుదలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పుడు... 'పద్మావత్' ఎందుకు రిలీజ్ చేయకూడదో ఆయా ప్రభుత్వాలు తెలపాలని కోర్టు అడిగింది.
ఇప్పటికే అధికార బీజేపీ పార్టీ హవా ఉన్న రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు 'పద్మావత్' చిత్రం విడుదలకు ససేమిరా ఒప్పుకొనే పరిస్థితి లేదని తేల్చి చెప్పాయి. అయితే వారి వాదనను ఖండిస్తూ.. ఆయా చిత్రాన్ని ఆయా రాష్ట్రాల్లో నిర్మాతలు విడుదల చేసుకోవచ్చని.. ఆయా నిర్మాతల భద్రతకు సంబంధించిన విషయం ఆయా రాష్ట్రప్రభుత్వాల బాధ్యత అని కోర్టు తెలిపింది. ప్రజలకు ఇష్టం ఉంటే ఆ సినిమా చూస్తారు.. లేకపోతే లేదని.. అందులో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఇప్పటికే చట్టపరంగా సెన్సార్ అయిన సినిమాని అడ్డుకోవడానికి రాష్ట్రాలకు హక్కు లేదని కూడా తెలిపింది. శ్యాంబెనగల్ లాంటి దర్శకులు ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. అయితే సుప్రీం కోర్టు తీర్పు గంటల వ్యవధిలోనే అనేకమంది రాజపుత్ర కర్ణిసేన కార్యకర్తలు ముజఫర్‌పూర్ ప్రాంతంలో ఆ చిత్రం ప్రదర్శించడానికి వీల్లేదని పిలుపునిస్తూ ధర్నా ప్రారంభించారు.