జఠిలమైన అయెధ్య  కేసు విషయంలో సుప్రీంకోర్టు స్పందించింది. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసు పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గమని  మరోసారి స్పష్టం చేసింది. స్నేహపూర్వక పరిష్కారానికి ఒక్క శాతం అవకాశం ఉన్నా దాని కోసం ప్రయత్నం చేయాలని సూచించింది.  అయితే ఈ ప్రక్రియ మొత్తం అత్యంత గోప్యంగా ఉంచాలని సూచించింది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కేసులో ఉభయ పక్షాలకు సమన్యాయం జరగాలనేదే తమ అభిమతమని ధర్మాసనం పేర్కొంది. తాము ఈ సమస్య పరిష్కారం కోసం  తీవ్రంగా పరిశీలిస్తున్నామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. అయితే ఈ కేసులోని ఇరుపక్షాలు మధ్యవర్తిత్వాన్ని అంగీకరించేందుకు సుముఖత చూపలేదని సమాచారం. దీంతో కోర్టు నేతృత్వంలోని మధ్యవర్తిని నియమించాలా లేదా అన్నదానిపై వచ్చే 5న తీర్పు వెలువరించనున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. 


అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లా మధ్య సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ అయోధ్య కేసు వ్యవహారంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది.