న్యూ ఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించే మహిళలను ఉచితంగా గమ్యస్థానాలకు చేర్చుతామన్న ఢిల్లీ సర్కార్ ప్రతిపాదనపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజాధనాన్ని పథకాలకు వెచ్చించే ముందు ఆచీతూచీ వ్యవహరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించిన అత్యున్నత న్యాయస్థానం.. మహిళలకు ఉచిత ప్రయాణం పథకంతో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ కి వచ్చే నష్టాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఢిల్లీ మెట్రో రైలులో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే ప్రతిపాదనను పరిశీలిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటనను సవాలు చేస్తూ ఎంసి మెహతా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సందర్భంలో సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళలకు భద్రత కల్పించే ప్రయత్నంలో భాగంగా టికెట్ చార్జీలు అధికంగా ఉన్న ఢిల్లీ మెట్రో రైలుతో పాటు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులు, మెట్రోకు అనుసంధానంగా సేవలు అందించే క్లస్టర్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే వీలు కల్పిస్తామని జూన్ 3న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఈ ప్రకటనపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2020లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందునే అరవింద్ కేజ్రీవాల్ ఈ జిమ్మిక్కులకు తెరతీశారని బీజేపి ఆరోపించగా.. ఒకరి దయా, దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం మహిళలకు లేదని పలువురు మహిళలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 


ఢిల్లీ సర్కార్ చేసిన ఈ ప్రతిపాదనను జూలై 27న కేంద్రం సైతం తిరస్కరించింది. మహిళలకు భద్రత కల్పించాలంటే మరో ప్రత్యామ్నాయమార్గాన్ని అన్వేషించాలి కానీ ఇలా ఉచితాలు అందించడం సరికాదని అప్పట్లో కేంద్రం అభిప్రాయపడింది.