టెలివిజన్, రిఫ్రిజిరేటర్ల ధరలు అమాంతం పెరగబోతున్నాయని పలు మార్కెట్ రిసెర్చ్ సంస్థలు తెలియజేస్తున్నాయి. ఈ నెలఖారు నుండి ఈ ధరలకు భారతదేశంలో రెక్కలొచ్చే అవకాశం కూడా ఉందని ఈ సంస్థలు చెబుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం డాలర్ రేటులో కనిపిస్తున్న వ్యత్యాసమని.. గత నెల క్రితం వరకు డాలర్ రేటు ఇండియన్ కరెన్సీలో రూ.66 నుండి రూ.67 రూపాయల వరకు ఉండేదని.. అదే రేటు రూ.70 వరకు పెరిగిందని.. దీని ప్రభావం పలు వస్తువుల మీద కూడా పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఎల్జీ, శాంసంగ్ వంటి సంస్థలు తమ ఉత్పత్తుల మీద 3 నుంచి 5 శాతం వరకు ధరలు పెంచే అవకాశం ఉందని.. లెనోవా సంస్థ కూడా ఉత్పత్తుల మీద ధరలు పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవలే ప్రభుత్వం కూడా టివి, రిఫ్రిజిరేటర్ల మీద జీఎస్టీని తగ్గించిన విషయం తెలిసిందే. అయితే దాని ప్రభావం భవిష్యత్ ధరల మీద కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది. ఫోరెక్స్ డీలర్స్ ప్రస్తుతం డాలర్ మారకపు విలువు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలియజేయడంతో.. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ ధరల మీద కూడా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 


మరో వైపు దీని ప్రభావం బంగారం ధరలపై కూడా పడే అవకాశం ఉంది. రూపాయి పతనంతో దేశంలో భారీస్థాయిలో బంగారం ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని.. రూపాయి విలువ క్షీణించడంతో వాణిజ్య లోటు, కరెంట్ అకౌంట్ ఖాతా లోటు పెరుగుతుందని వాణిజ్య నిపుణులు అంటున్నారు. మరోవైపు రూపాయి మారకం విలువను పతనం కాకుండా నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయ పథకాలను ప్రారంభించే అవకాశం కూడా ఉందని పలువురు అంటున్నారు. రూపాయి విలువ స్థిరత్వాన్ని పరిగణనలోకి తీసుకుని మన సర్కారు ఎన్నారై బాండ్లను కూడా జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.