వాజ్‌పేయి అంతిమయాత్రలో పాల్గొన్న మోదీ.. భద్రత కట్టుదిట్టం
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంతిమ యాత్ర ప్రారంభమైంది.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంతిమ యాత్ర ప్రారంభమైంది. బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి వాజ్‌పేయి అంతిమ యాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు యమునా నది ఒడ్డున ఉన్న రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో వాజ్‌పేయి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. విజయ్‌ఘాట్ పక్కన 1.5 ఎకరాల్లో వాజ్‌పేయి మెమోరియల్ ఏర్పాటు చేయనున్నారు.
వాజ్‌పేయి అంతిమయాత్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. వాజ్‌పేయికి నివాళులు అర్పించేందుకు దారిపొడవునా జనం నిలబడ్డారు. బీజేపీ కార్యాలయం నుండి రాష్ట్రీయ స్మృతి స్థల్ మధ్య దూరం 4 కిలోమీటర్లు.
అటు అంతిమయాత్ర నేపథ్యంలో రహదారులన్నింటిని నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ (ఎన్ఎస్‌జీ) విభాగం తమ ఆధీనంలోకి తీసుకుంది. బీజేపీ ఆఫీస్ నుంచి స్మృతి స్థల్ వరకు దారితీయనున్న రహదారిలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇదేకాకుండా స్మృతి స్థల్ వైపు వెళ్లే దారులన్నింటిపై నిఘా ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులతోపాటు విదేశాల నుంచి సైతం వివిధ రాజ్యాధినేతలు అటల్ బిహారి వాజ్‌పేయికి కడసారి వీడ్కోలు పలికేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్రం గట్టి చర్యలు తీసుకుంది.