కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సోమవారం బీజేపీ కార్యకర్తలపై ధ్వజమెత్తారు. తిరువనంతపురంలోని తన నియోజకవర్గ ఆఫీసుపై భారతీయ జనతా యువ మోర్చ వాలంటీర్లు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఆఫీసు గోడలపై నల్లటి ఇంజిన్ ఆయిల్ పూయడంతో పాటు.. పిటీషన్లు తీసుకొని వచ్చిన అమాయక ప్రజలపై కూడా చాలా కరకుగా వ్యవహరించారని.. ఇలాంటివి తాను ఉపేక్షించనని శశి థరూర్ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ కార్యకర్తలు తనను హత్య చేస్తామని బెదిరించారని.. ఇలాంటి పనులు చేసేవారు కచ్చితంగా ప్రజాస్వామ్యానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకి వ్యతిరేకులని తాను భావిస్తున్నానని శశి థరూర్ తెలిపారు. గతవారం శశిథరూర్ బీజేపీ పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 2019లో బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి.. ఆ పార్టీ దేశాన్ని హిందూ పాకిస్తాన్‌గా మార్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మహాత్మ గాంధీ, నెహ్రు, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్ వంటి గొప్ప నాయకులు  స్వాత్రంత్య్రం కోసం పోరాడింది ఇలాంటి రాజ్యం కోసం కాదని ఆయన తెలిపారు. 


ఎప్పుడైతే శశిథరూర్ ఆ వ్యాఖ్యలు చేశారో సోషల్ మీడియాలో ఆయన పై అనేకమంది బీజేపీ కార్యకర్తలు ధ్వజమెత్తారు. శశి థరూర్ బీజేపీ అధిష్టానానికి క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుందని కూడా తెలిపారు. బీజేపీ నేత సంబిత్ పాత్ర కూడా శశిథరూర్ వ్యాఖ్యల పై స్పందించారు.


కాంగ్రెస్ గేమ్ ప్లాన్ అనేది భారతదేశాన్ని అతలాకుతలం చేయడానికే మాత్రమే పనికొస్తుందని.. వారు తమను పాకిస్తాన్‌తో పోల్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని.. దేశం గురించి మంచి మాటలు మాట్లాడే సంస్కారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పోగొట్టుకుందని తెలిపారు. అలాగే బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా శశి థరూర్ పై విరుచుకుపడ్డారు. శశి థరూర్ వైఖరిని ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్‌గా తీసుకోవాలని.. ఆయనకు వైద్య సహాయాన్ని అందించాలని అన్నారు.