బాలీవుడ్ నటి స్వరభాస్కర్ ఈ రోజు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మగాంధీని హత్యగావించినప్పుడు... ఆ ఘటనను వేడుకలా జరుపుకున్నవారు ఈ రోజు అధికారంలో ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే నేటి సమాజం జనాలను జైల్లో పెట్టి హింసించాలన్న రక్తదాహంతో ఉండకూడదని వ్యాఖ్యానించారు. అలాగే 1980ల్లో పంజాబ్‌లో పెచ్చుమీరిన టెర్రిరిజం గురించి కూడా ఆమె మాట్లాడారు. ఆపరేషన్ బ్లూస్టార్‌లో చనిపోయిన టెర్రరిస్టు జైర్నేల్ సింగ్ బింద్రన్ వాలేని సంత్ లేదా సాధువుగా పరిగణించిన వారు కూడా ఉన్నారని.. వారినందరిని కూడా జైల్లో పెట్టలేదు కదా..? అని స్వరభాస్కర్ ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్వరభాస్కర్ ఇటీవలే ప్రభుత్వం కొందరు మానవ హక్కుల కార్యకర్తలతో పాటు పౌరహక్కుల కార్యకర్తలను అరెస్టు చేసిన ప్రక్రియపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం భారతదేశంలో జైళ్లు సాహితీవేత్తలను, మానవ హక్కుల కార్యకర్తలను, విద్యావేత్తలను, పసిపిల్లలను కాపాడే వైద్యులను బంధించడానికి మాత్రమే ఉన్నాయని ఆమె తెలియజేశారు.


స్వరభాస్కర్ బాలీవుడ్‌లో గుజారిష్, ప్రేమ్ రతన్ దన్ పాయో, అనార్కలి కా ఆరా, వీరే ది వెడ్డింగ్ లాంటి చిత్రాలలో నటించారు. రాజ్యసభ టివిలో టెలికాస్ట్ అయిన "సంవిధాన్" కార్యక్రమానికి గతంలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు.  "రాంఝానా" చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయనటిగా స్క్రీన్ అవార్డుతో పాటు జీ సినీ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఈమె తల్లి ఇరా భాస్కర్ జేఎన్‌యూలోని సినిమా స్టడీస్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.ఈమె తండ్రి చిత్రపు ఉదయ్ భాస్కర్ ప్రస్తుతం సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్‌కు డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు.