టిప్పుసుల్తాన్ జయంతి వేడుకల పేరుతో ప్రజల సొమ్ము వృధా చేయవద్దు: బీజేపీ
ఒకప్పుడు మైసూరును పాలించిన టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను 2014 నుంచి కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
ఒకప్పుడు మైసూరును పాలించిన టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను 2014 నుంచి కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్సవాలను ఇక జరపరాదని పలు సంఘాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రస్తుతం కర్ణాటకలో పలు చోట్ల పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఆందోళన చేస్తున్న శ్రేణుల్లో పలువురు బీజేపీ నేతలు కూడా పాలుపంచుకోవడంతో పరిస్థితి ఇంకా వేడెక్కింది. బెంగళూరు, మైసూరు, కొడగు ప్రాంతాల్లో ప్రస్తుతం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అయితే గత ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన విధానాన్నే తాము అనుసరిస్తామని ముఖ్యమంత్రి కుమారస్వామి చెబుతున్నా కూడా.. ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. టిప్పుసుల్తాన్ జయంతి వేడుకల పేరుతో ప్రజల సొమ్ము వృధా చేయవద్దని బీజేపీ నేతలు కర్ణాటకలో స్లోగన్స్ చేస్తున్నారు. "టిప్పు సుల్తాన్ పోరాట యోధుడు కాదు. ఆయన కొన్ని వేలమంది హిందువులను ఊచకోత కోశారు. అందుకే మేం ఆయన జయంతి వేడుకలను సమర్థించడం లేదు" అని కర్ణాటక బీజేపీ పార్టీ ప్రతినిధి సజ్జల్ క్రిష్ణన్ తెలిపారు.
ప్రస్తుతం కర్ణాటకలో డిప్యూటీ సీఎం జి పరమేశ్వర ఆధ్వర్యంలో టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. అయితే అనారోగ్య కారణాల వల్ల సీఎం కుమారస్వామి ఈ వేడుకలకు హాజరు కావడం లేదని సీఎం ఆఫీసు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర సెక్రటేరియట్‌లో టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలను ఈ రోజు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఘనంగా ప్రారంభించనున్నారు. అయితే కుమారస్వామి కావాలనే ఈ వేడుకల నుండి తప్పుకుంటున్నారని పలువురు బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. స్వయానా ముఖ్యమంత్రి హాజరుకాకుండా ఈ వేడుకలను బహిష్కరిస్తున్నారని.. కనుక పరిస్థితిని అంచనా వేయవచ్చని పలువురు బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు.