మొఘల్ చక్రవర్తి అక్బర్‌ని కలవాలంటే.. గంగాజలం తాగండి: కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గంగానదిని ప్రక్షాళన చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. 2016లో కేంద్ర జలవనరుల శాఖ సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ సమర్పిస్తూ.. మొఘలుల కాలంలో అక్బర్ చక్రవర్తి ఆరోగ్యం కోసం గంగా జలాలే సేవించేవారని పేర్కొందని.. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదని సింఘ్వీ తెలిపారు. ఈ రోజు గంగా జలాలు ఎంతగా కలుషితమయ్యాయంటే.. ఆ జలాలు తాగితే ప్రజలు మరణించి పరలోకానికి పోయి.. స్వయంగా అక్బర్ చక్రవర్తి దర్శనం చేసుకోవచ్చని సింఘ్వీ ప్రభుత్వంపై సెటైర్లు విసిరారు.
మోదీ ప్రభుత్వం వారణాశి ప్రజలకు ఇచ్చిన మాటను పూర్తిగా తప్పిందని.. గంగానది భ్రష్టు పట్టడానికి కారణం ప్రభుత్వమేనని.. వారు ప్రారంభించిన "క్లీన్ గంగా" ప్రాజెక్టు ఓ పెద్ద భూటకమని సింఘ్వీ పేర్కొన్నారు. ఇటీవలే కేంద్ర కాలుష్య నివారణ బోర్డు ఓ మ్యాప్ రిలీజ్ చేస్తూ.. ఉత్తర ప్రదేశ్, బెంగాల్ ప్రాంతాల్లో ప్రవహించే గంగానదిలో చాలావరకు జలాలు ప్రజలు తాగడానికి, స్నానం చేయడానికి పనికిరావని.. ఆ జలాలను వినియోగిస్తే రోగాల బారిన పడడం ఖాయమని బోర్డు తెలిపిందని సింఘ్వీ పేర్కొన్నారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కూడా ఇటీవలే హరిద్వార్, ఉన్నాయో ప్రాంతాల్లో గంగా జలాలను ప్రజలు వినియోగించకుండా చూడాలని ఆదేశించిందని సింఘ్వీ తెలిపారు. 2014 ఎన్నికలలో భాగంగా వారణాశి ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ మాటిస్తూ... గంగానదిని ప్రక్షాళన చేయడం తన బాధ్యతని తెలిపారని.. కానీ ఆయన మాట తప్పారని సింఘ్వీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సింఘ్వీ పశ్చిమ బెంగాల్ తరఫున రాజ్యసభలో ఎంపీగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన భారత ప్రభుత్వానికి అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా కూడా వ్యవహరించారు.