College Girls Nude Videos Row From Udupi: ఉడిపి: కర్ణాటక ఉడిపిలోని ఓ ప్రైవేటు పారామెడికల్ కాలేజీ వాష్‌రూమ్‌లో ఒక విద్యార్థిని మరో ముగ్గురు ముస్లిం విద్యార్థినులు నగ్నంగా చిత్రీకరించారనే ఆరోపణలపై కర్ణాటకలో బీజేపి భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ముగ్గురు ముస్లిం విద్యార్థినులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు జాప్యం జరిగిందంటూ బిజెపి కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. తాజాగా ఈ వివాదంపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, బిజెపి నాయకురాలు ఖుష్బు సుందర్ స్పందించారు. ప్రైవేట్ పారామెడికల్ కాలేజ్ వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాలు ఉన్నాయనే వాదనలను ఖండించిన ఖుష్బూ సుందర్.. ఈ వివాదంలో ఎలాంటి వాస్తవం లేదు అని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ఖుష్బూ సుందర్ మీడియాతో మాట్లాడుతూ, బయట ప్రచారం జరుగుతున్నట్టుగా కాలేజ్ వాష్ రూమ్ లో సీక్రెట్ హిడెన్ కెమెరాలు ఏమీ లేవు అని స్పష్టంచేశారు. ఇది ఒక విద్యా సంస్థ. ఇక్కడ సీక్రెట్ కెమెరాలు ఉండకూడదన్నారు. ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన ఉడిపిలోని నేత్ర జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌ని గురువారం సందర్శించిన ఖుష్బు సుందర్.. ఈ కేసు దర్యాప్తునకు సహకరించాల్సిందిగా కోరుతూ యాజమాన్యంతో చర్చించారు. కాలేజీ వాష్‌రూమ్‌లో ఒక విద్యార్థినిని తోటి విద్యార్థినులే నగ్నంగా వీడియో చిత్రీకరించారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో విచారణలో భాగంగా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి హోదాలో ఖుష్బూ సుందర్ కాలేజీకి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


" కాలేజ్ మరుగుదొడ్లలో రహస్య కెమెరాలు ఉన్నాయని వస్తున్న పుకార్లలో నిజం లేదు. ఈ ఘటనతో సంబంధం లేని నకిలీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది ఒక విద్యా సంస్థ అయినందున ఇక్కడ రహస్య కెమెరాలు ఉండవు. మేము పోలీసులతో కలిసి దర్యాప్తు చేస్తున్నాం. అతి త్వరలోనే ఈ ఘటనపై ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది" అని ఖుష్బు సుందర్ తెలిపారు.



 


ఈ వివాదానికి మతం రంగు పులుమొద్దు
కాలేజీలో న్యూడ్ వీడియోస్ రికార్డింగ్ అంటూ పుకార్లు వ్యాపింపచేసి ఈ ఘటనకు మతం రంగు పులుముతూ అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దు అని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం ఉడిపి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అక్షయ్ హకే మచ్చింద్రా, ఇతర అధికారులతో కలిసి జాతీయ మహిళా కమిషన్ బృందం పారామెడికల్ కాలేజీకి చేరుకుంది. నేత్ర జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌ కాలేజ్ డైరెక్టర్ రష్మీ, అకడమిక్ కో-ఆర్డినేటర్ బాలకృష్ణ, ప్రిన్సిపాల్ రాజీప్ మోండల్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాది మేరీ శ్రేష్ఠ తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.