Unnao rape case victim` death | ఉన్నావ్ రేప్ కేసు: నిందితులను హైదరాబాద్ తరహాలో ఎన్‌కౌంటర్ చేయాలి.. బాధితురాలి తండ్రి డిమాండ్
హైదరాబాద్‌లో దిశపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసిన కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసినట్టుగానే తన కూతురిని బలిదీసుకున్న నిందితులను సైతం ఎన్‌కౌంటర్ చేయాలని ఉన్నావ్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడి శుక్రవారం రాత్రి మృతిచెందిన బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు.
న్యూ ఢిల్లీ: ఉన్నావ్ రేప్ కేసులో ఐదుగురు నిందితుల చేతిలో దాడికి గురైన బాధితురాలు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఈ కేసు నేపథ్యం విషయానికొస్తే.. గతేడాది డిసెంబర్‌లో తనను అపహరించిన శివం త్రివేది, శుభం త్రివేది తనపై సామూహిక అత్యాచారం జరిపారంటూ బాధితురాలు కోర్టుకు ఫిర్యాదు చేయగా... అప్పటి నుంచి రాయ్‌బరేలీ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తుండగానే నిందితులు బాధితురాలిపై దాడి చేసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ దాడిలో 90 శాతం కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడిన అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. 90శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిపాలైన బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. బాధితురాలి మృతిపై ఆమె కుటుంబసభ్యులు, బంధువుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే విషయమై తాజాగా బాధితురాలి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. 'తన సోదరికి అన్యాయం చేసిన ఆ ఐదుగురు బతికి ఉండటానికి వీల్లేదు' అని అన్నారు. ''తన సోదరి ఉన్న చోటికే వారిని కూడా పంపించాలి. ఆ ఐదుగురికి మరణ శిక్ష విధించాల్సిందే. అంతకంటే ఏ శిక్ష వేసినా అది తక్కువే. వాళ్లను జైళ్లలో పెట్టి కాలం గడపొద్దు. ఈ విషయంలో మేం చెప్పడానికి ఇంకా ఏం లేదు. అంతకు మించి ప్రభుత్వం నుంచి ఇంకేమీ కోరుకోవట్లేదు'' అని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా తన సోదరి మృతదేహాన్ని నిందితుల ఇంటి ముందే దహనం చేసి తమ నిరసన తెలియజేస్తామని అన్నారు.
కూతురు మృతిపై ఆమె తండ్రి స్పందిస్తూ.. హైదరాబాద్‌లో దిశపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసిన కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసినట్టుగానే తన కూతురిని బలిదీసుకున్న నిందితులను సైతం ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిందితులను వెంటనే ఉరి తీయాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు.