లక్నో: ఓ బీజేపీ యువ నేతను గుర్తుతెలియని దుండగులు పదునైన కత్తులతో దాడిచేసిన దారుణమైన ఘటన సోమవారం రాత్రి ఉత్తర్ ప్రదేశ్ లోని బాద్‌షా నగర్ లో చోటుచేసుకుంది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి, రోడ్డు పక్కన రక్తపు మడుగులో పడి వున్న స్థానిక బీజేపీ నేత ప్రత్యూష్ మణి త్రిపాఠి(34)ని అటుగా వెళ్తున్న స్థానికులు చూసి కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటి(కేజీమెయూ) ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారిజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. త్రిపాఠి చనిపోవడానికి ముందు ఆయన తనపై దాడి చేసిన వారిలో ఓ ఐదుగురి వ్యక్తుల పేర్లు వెల్లడించాడని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రిపాఠి మృతి వార్త తెలుసుకున్న మద్దతుదారులు భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకుని పోలీసులకు వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. తనకు శత్రువుల నుంచి ప్రాణహాని ఉందని, వారి నుంచి రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ త్రిపాఠి పోలీసులకు విజ్ఞప్తి చేసినప్పటికీ పోలీసులు ఆయన మాటను పెడచెవిల పెట్టారని, అందువల్లే ఆయన హత్యకు గురయ్యారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తంచేశారు.


కొద్దిరోజుల క్రితం ఓ మహిళపై లైంగిక వేధింపుల కేసు విషయమై త్రిపాఠి పక్కింటి వారితో గొడవ పడ్డాడని, అప్పటి నుంచి వారు అతడిపై పగపట్టారని త్రిపాఠి కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. త్రిపాఠి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.