ఉత్తరప్రదేశ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ కాళ్ల మీద పడి మొక్కిన పోలీస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ సింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలో ఆదిత్యనాధ్ పోలీస్ నుదిటిపై బొట్టు పెట్టి ఆశీర్వదించినట్లు కూడా కనిపించడంతో ఇప్పుడు ఆయా అధికారిపై పోలీస్ శాఖ కూడా మండిపడుతోంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా ప్రస్తుతం ఆదిత్యనాధ్ గోరక్షనాధ్ పీఠానికి ప్రధాని పూజారిగా కూడా సేవలందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మఠ పుజారి వద్దకు భక్తులు ఆశీర్వాదం తీసుకోవడానికి రావడం సహజమేనని.. ఈ విషయాన్ని సాధారణమైన విషయంగానే చూడాలని సీఎం కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. గురుపూర్ణిమ సందర్భంగా ఓ శిష్యుడు గురువు వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం తప్పు కాదని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే పోలీస్ అధికారి ఓ భక్తుడిగా అక్కడి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటే తప్పుండేది కాదని.. కానీ యూనిఫారంతో వెళ్లి కాళ్ల మీద పడి మొక్కడం వల్ల ఆ అధికారి తన హుందాతనాన్ని కోల్పోయారని పలువురు అంటున్నారు. 


యూపీ సీఎం ఆదిత్యనాధ్ మెడలో పూలమాల కూడా వేసి.. ఆశీర్వాదం తీసుకున్న ఫోటోలు అధికారే స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేయడంతో అవి బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలపై భిన్నవాదనలు వినిపించాయి. ప్రతిపక్షాలు ఎదుటివారి తప్పులను పట్టడమే పనిగా పెట్టుకున్నారని.. వారు ముందు తమ తప్పులను సరిదిద్దుకుంటే మంచిదని బీజేపీ నేతలు పలువురు సోషల్ మీడియాలోనే విమర్శకులను దుయ్యబట్టారు. అయితే సీఎం హోదాలో ఉన్న ఆదిత్యనాధ్ యూనిఫారంలో ఉన్న ప్రభుత్వాధికారులకు ఆశీర్వాదాలు ఇవ్వడం మానుకోవాలని కూడా పలువురు హితవు పలికారు.