కర్ణాటక రాజకీయాల్లో మరో సరికొత్త కోణం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర స్థాపించిన పార్టీలో సభ్యుల మధ్య ఏర్పడుతున్న పరస్పర ఘర్షణల పట్ల అధినేత విముఖతతో ఉన్నారని తెలుస్తోంది. అందుచేత ఆయన తన పార్టీని రద్దు చేయడం గానీ.. భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడం గానీ చేసే అవకాశం ఉందని పలు పత్రికలు రాస్తున్నాయి. ఇటీవలే ట్విట్టర్‌లో ఉపేంద్ర చెప్పిన మాటలు కూడా ఈ విషయాలను దాదాపు ధ్రువపరుస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే ఉపేంద్ర పార్టీలో కీలక బాధ్యతలు వహిస్తున్న నటుడు శివకుమార్ కూడా పార్టీ గురించి చాలా అసంతృప్తిగా మాట్లాడారు. ముఖ్యంగా ఉపేంద్ర ఒక డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఉపేంద్ర ఖండించడం గమనార్హం. తాను మార్పును ఆశించే రాజకీయాల్లోకి వచ్చానని.. కాని అది వెనువెంటనే రాదని తనకు తెలుసని అన్నారు. తానంటే కిట్టని శక్తులేవో తన గురించి చెడుగా మాట్లాడుతున్నాయని ఆయన అన్నారు. అయితే కొద్ది రోజులలో ఉపేంద్ర, మోదీ ప్రేరణతో భారతీయ జనతా పార్టీలో చేరబోవడం ఖాయమని పలువురు తెలపడం గమనార్హం.


ఇలాంటి పరిస్థితే గతంలో ‌ఆంధ్రప్రదేశ్‌లో నటుడు చిరంజీవికి ఎదురైంది. అయితే ఆయన18 సీట్లు గెలుచుకున్నాక కూడా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. కనీసం ఎన్నికల్లో కంటెస్ట్ కూడా చేయకుండా పార్టీని విలీనం చేస్తే చెడు సంకేతాలు వెళ్తాయని.. అలాంటి ఆలోచన మనసులో ఉంటే ఉపేంద్ర ఉపసంహరించుకుంటే మంచిదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.