ముంబై: బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సినీ నటి ఉర్మిళా మటోండ్కర్ బుధవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ముంబై విభాగం అధ్యక్షుడు మిలింద్ దేవ్‌రా, పార్టీ అధికార ప్రతినిథి ప్రియాంక చతుర్వేది, రణ్‌దీప్ సుర్జెవాలా సమక్షంలో ఉర్మిళా మటోండ్కర్‌ని రాహుల్ గాంధీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన సందర్భంగా ఊర్మిళా మటోండ్కర్ మాట్లాడుతూ.. పార్టీలోకి తనకు స్వాగతం పలికిన రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు అంటూ పార్టీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహాత్మా గాంధీ, జవహార్ లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభభాయ్ పటేల్ వంటి మహనీయుల ప్రభావం తనపై ఎంతగానో వుందని చెప్పిన ఆమె.. స్వాతంత్ర్యం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి తనకు బాగా తెలుసునని అన్నారు. సాధరణంగా సినిమా వాళ్లకు వుండే ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూసి రాజకీయ పార్టీలు వారిని తమతమ పార్టీలోకి ఆహ్వానిస్తుంటాయి కానీ తన విషయంలో అలా జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీపై వున్న నమ్మకం, దేశానికి తన వంతుగా ఏమైనా చేయలన్న తపనే తనను కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేశాయని తెలిపారు. 


ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమెకు బాంబే నార్త్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.